చింతు

సెప్టెంబరు 29, 2007

సాహితీవనం-5 జవాబులు

ప్రచురించిన వర్గము జవాబులు, దీప్తిధార, సాహితీవనం — Dr.Ismail Penukonda @ 6:09 అపరాహ్నం

పవిత్ర రంజాన్ మాసంలో తొలి ఉపవాసం ఉంటూ, చేస్తూన్న దీప్తిధార ‘సాహితీవన’ విహారం:

అ. ‘రష్యన్ సీత’ కథా సంపుటి రచయిత్రి : కందుకూరి వెంకట మహాలక్ష్మి. (గూగులమ్మ: నరుడా ఏమి నీ కోరిక? :)

ఆ. ”ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండు తాటాకుల్” అని పారడి రాసింది: ఝరుక్ శాస్త్రి? (పేరడీ శూరుడు, సాహితీ చంద్రుడు, సుధలు కురిసే కథలు, సుడిగాలి విసిరే కవితలు, రాసిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి.)

ఇ. ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి : శ్రీత్యాగరాజ, తిరువాయూరు. (ఎందరో మహానుభావు లందరికి వందనము.)

ఈ. సుగాత్రి అంటే ఏమిటి? : పైన పేర్కొన్నవి ఏవీ కావు. (మంచి గాత్రం కలది)

ఉ. కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం : కవి సేన? (మెగాసేన లాగా కవులకూ అభిమాన సంఘాలున్నాయండోయ్!)

ఊ. పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి : శిలాలోలిత. (పదుకొండేళ్లకే పెళ్లి అనే పంజరంలో చిక్కుకున్న పక్షి, ఈ ‘లక్ష్మి’ కలం పేరు రేవతీదేవి విరచిత శిలాలోలిత. మళ్లీ గూగులమ్మ వరమే!)

ఎ. ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి : వెల్చేరు నారాయణ రావు. (విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో ఆసియా భాష-సంస్కృతి-సాహిత్యాల అధ్యయన విభాగంలో ‘శ్రీకృష్ణదేవరాయ పీఠం’ ఆచార్యుడు. గూగులమ్మకు నేనే చెప్పా:)

ఏ. ఆలాపన రాసిన రచయిత : వి.ఎ.కె.రంగారావు. (చిక్కవరం జమీందారు, ‘పాట’ వీరాభిమాని-అఫిషినాడో కు తెలుగు,ఆలాపన పేరిట ఓ దినపత్రికలో-వార్త? పాటల గురించి రాసిన గుర్తు)

ఐ. చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు : పెళ్లి పుస్తకం. (రాజేంద్రుడు ఈ సినిమాలో చీరల రూపకల్పి)

ఒ. “మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు ” అని గర్జించిన రచయిత : వట్టికోట ఆళ్వార్ స్వామి? (‘ప్రజల మనిషి’ రచయిత, తెలంగాణా పోరాటయోధుడు.)

మరి నా ‘ఇఫ్తార్’ విందేది?

ఆపదలో ఉన్న ‘సురేష్’ ను ఆదుకోండి!

ప్రచురించిన వర్గము ప్రమాదం, సహాయం, సురేష్ — Dr.Ismail Penukonda @ 5:04 పూర్వాహ్నం

దారుణమైన ప్రమాదానికి గురయి ఆపదలో ఉన్న సురేష్ ను ఆదుకోండి. మీకు చేతనైంత సాయం చేయండి ఇక్కడ.

సెప్టెంబరు 28, 2007

‘కొత్తపాళీ’-'బూనృ’త్య విలాసంబెట్టిదనిన…

ప్రచురించిన వర్గము కొత్తపాళీ, భరతనాట్యం, విశ్వరూపం — Dr.Ismail Penukonda @ 10:03 అపరాహ్నం

ఎవరీ కొత్తపాళీ? అన్నది, ఆయన బ్లాగ్లోకంలో మెఱుపులా దూసుకొచ్చినప్పటి నుంచీ నాకు సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది. ఈయన మనకన్నా చాలా పెద్దాయన, తెలుగు సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్నాయన, బహుశా వేల్చేరు గారేమో అని రానారెని ప్రశ్నించడమూ జరిగింది. కానీ చివరికి శ్రీరాముడి దయ చేతను, నా పరిశోధన మూలంగానూ మన అభినవ బూన్(బ్లాగు బ్రౌణ్) దొర గారు దొరికారు. ఒకప్పటి ఈ బాపట్ల బ్రహ్మచారి గారే ‘నాశి‘గా రచ్చబండలోనూ, ‘ఈమాట’లో ఎస్.నారాయణస్వామిగా ఎన్నో కథలను రాసిన రచయిత గానూ, ఈనాడు తెలుగు బ్లాగులను కొత్త పుంతలు తొక్కిస్తున్న ‘కొత్తపాళీ‘గానూ, ఫ్లికర్లో భరతనాట్య ప్రదర్శన చేస్తూన్న ‘నాశిశాన్‘గానూ, ఈ బహుముఖప్రజ్ఞాశాలి తన విశ్వరూపసందర్శనం కావించారు. మరి తెలుగు బ్లాగర్లందరూ ఒకరికొకరు ముఖపరిచయం లేకున్నా మన బ్లాగు చిత్రాల ద్వారా అందరికీ తెలుసు, కావున సభామర్యాద కాదేమో అని రాముడనుకొన్నా ధైర్యం చేసి ఈ విషయం బ్లాగుతున్నాను. ఇక చిత్రం ‘సర్వజన’ విభాగంలో ఉండడం వల్ల అందరూ చూసినా అభ్యంతరం లేదనుకొంటాను. అయినా నా తెంపరితనానికి ముందుగానే క్షమాపణలతో…

‘చిరుత’: పులి కడుపున పులే పుడుతుంది!

ప్రచురించిన వర్గము చరణ్, చిరుత, సినిమా — Dr.Ismail Penukonda @ 3:47 పూర్వాహ్నం

ప్రతి చిరంజీవి సినిమా మొదటి రోజు – మొదటి ఆట చూడటం గ్యాంగ్ లీడర్ నుంచీ అలవాటు. కానీ మరి మెగాపుత్రుడి సినిమా మాత్రం పని ఒత్తిడి వల్ల ఓ ఆట ఆలశ్యమయ్యింది. అయితేనేం నేను మొన్న చెప్పినట్టు నేను పని చేసే విశ్వవిద్యాలయానికి అరమైలు దూరంలోనే సినిమా ఆడుతుండడం మూలాన పెద్ద ఇబ్బందేం కలుగలేదు. అన్నట్టు మన బ్లాగ్లోకంలో మాత్రం నేనే ప్రథముణ్ణి;)…అనుకొంటా!

ఇక చరణ్ పాటలలో, సాహసకృత్యాలలో తనదైన మెఱుపు చూపించి నిజంగానే ‘చిరుత’ అనిపించుకొన్నాడు. మొదటి ఫైటు, మొదటి పాటకు నృత్యం అదరగొట్టాడు. సినిమా అంతా చిరు ప్రస్తావన సూటిగా ఎక్కడా లేకున్నా,తను నటించిన పాత్రలు అన్నీ అంతర్వాహిణిగా చరణ్ పాత్రలో చూపించారు. మచ్చుకు ఖైదీ నంబర్ 786, వేట, అడవిదొంగ, ఖైదీ…జాగ్రత్తగా గమనిస్తే ఇలా ఏదో ఒక చోట ఆ జ్ఞాపకాలు తడుముకోవచ్చు. ఇక నృత్యాలలో తండ్రిలోని స్పార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది ఇంతకూ కథేంటి? అంటారా…ఎనభైలలో సగటు తెలుగు సినిమా కథే ఈ కథ! అసలు ఈ కథకు పూరీ అవసరం ఉందా అనిపించింది. మాస్ ని దృష్టిలో పెట్టుకొని, ప్రయోగాలకు పోకుండా, ఏదో పాటలకు, ఫైటులకు తగిన వేదిక ఉండాలని “తండ్రి చంపబడడం-అనాథగా పెరగడం-తల్లికోసం గాలింపు-పొగరుబోతు కథానాయిక-ప్రేమ-పగ-ప్రతినాయకుడి చావు-శుభం” ఇలా నడిపించేశారు కథని. చరణ్ సంభాషణా చాతుర్యం ఇంకా మెరుగుపరుచుకోవాలి. నటనలో పాసు మార్కులు పడ్డా, మునుముందు మంచి కథ పడితే తన నిజమైన సత్తా బయటపడుతుంది. కానీ ఆ నృత్యాలకు మాత్రం డిస్టింక్షనే! చిరంజీవ! చిరంజీవ!!
కొసమెఱుపు: మన శివారెడ్డి సినిమా చూడ్డానికి విచ్చేశాడు. తన కళాకౌశలాన్ని ప్రస్తుతించి, యూట్యూబ్ లో తనకు పెరుగుతున్న ఆదరణ గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడుకొన్నాం.
{చిత్రాలు: ఐఫోను సౌజన్యం.}

సెప్టెంబరు 25, 2007

కొడితే కొట్టాలిరా…ఇలా కొట్టాలి! జయహో ఇండియా!!

ప్రచురించిన వర్గము ఇండియా, క్రికెట్, విజేత — Dr.Ismail Penukonda @ 2:53 పూర్వాహ్నం

సెప్టెంబరు 22, 2007

బ్లాగ్కలహాలు!

ప్రచురించిన వర్గము కలహాలు, బ్లాగు, బ్లాగ్కలహాలు — Dr.Ismail Penukonda @ 5:37 పూర్వాహ్నం

ఇదేదో కొత్త రకం ఆల్కహాలని ఇటు వేపు వచ్చిన మందుబాబులకు క్షమాపణలతో…

ఈ మధ్య మన బ్లాగుల్లో కలహాలు ఎక్కువయ్యాయి. మరీ చెప్పుకోదగినంతవి కాకపోయినా…తెలుగు వారిలో కాస్తో కూస్తో సమైక్యంగా ఉన్నది మన బ్లాగర్లేనని అనుకొన్నంతలో…ఇలా జరగడం శుభసూచకం కాదు. మన మధ్య అభిప్రాయభేదాలు ఉండడం సహజం, అసలు అవే చర్చకు పునాది. కానీ ఆ అభిప్రాయలను వ్యక్తపరచడానికి మనకున్న మాధ్యమం అయిన బ్లాగులే ఈ కలహాలకు కారణం. అవును…మీరు మనస్సులో ఒకటనుకొని రాస్తారు దాన్ని చదివి ఆ భావం అందక, మరోలా భావించుకొని, ఇంకోలా సమాధానం చెప్తారు కొందరు. దీనికి కారణం మనలోని ఆలోచనలు సరిగా ఇతరులకు తెలియాలంటే మాట పలికే తీరు, మన ముఖకవళికలు, సమయం, సందర్బం ఇలా ఎన్నో ఉన్నాయి. రాతలో సంభాషణ చేయాలంటే కుదరదు మరి. కానీ బ్లాగ్ముఖంగా మనం రోజూ చేస్తున్నదదే! అందుకే ఈ తంటా! కావలిస్తే మన బ్లాగుల్లోనే కాదు ‘ఈమాట‘ వగైరా చోట్ల జరిగే కామెంట్ల సంభాషణ చదవండి మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇకపై టపా రాసేటప్పుడు, వ్యాఖ్య చేసేటప్పుడు ఈ ముక్క మనసులో పెట్టుకోవాలని మనవి. (ఈ ‘సెమాంటిక్స్’ గురించి మన భాషా శాస్త్రజ్ఞులైన ‘కొలిచాల’ గారి నుంచి ఓ టపా/వ్యాఖ్య ఆశిస్తూ…ఎన్నాళ్లుగానో ఈ సంగతి రాయాలని అనుకొంటూ వాయిదా వేస్తున్నా… ఇప్పటికి రాయించిన ‘రానారె‘కు నెనర్లు!)

ఉపసంహారం: బ్లాగులు రాస్తున్న రెంటి’గాళ్ల’లో (ఒంటిగాడు కానివాడు రెంటిగాడు:) జరిగే బ్లాగ్కలహాలు మరో ఎత్తు!

సెప్టెంబరు 21, 2007

ఏ జిల్లా? ఏ జిల్లా? … "ము.మం." నీది ఏ జిల్లా?

ప్రచురించిన వర్గము ఆంధ్రప్రదేశ్, పుట్టిన ఊరు, ముఖ్యమంత్రి — Dr.Ismail Penukonda @ 2:49 పూర్వాహ్నం

ఇల్లూరు – అనంతపురం జిల్లా.

పెదపాడు – కర్నూలు జిల్లా.
చిరుమామిళ్ల – గుంటూరు జిల్లా.
లక్నేపల్లి – వరంగల్ జిల్లా.
సోపేరు – శ్రీకాకుళం జిల్లా.
సిరిపురం – రంగారెడ్డి జిల్లా.
బానూర్ – మెదక్ జిల్లా.
గొల్లపాడు – గుంటూరు జిల్లా.
లద్దగిరి – కర్నూలు జిల్లా.
నిమ్మకూరు – కృష్ణా జిల్లా.
దోనేపూడి – గుంటూరు జిల్లా.
వాకాడు – నెల్లూరు జిల్లా.
నారావారిపల్లె – చిత్తూరు జిల్లా.
పులివెందుల – కడప జిల్లా.
అటుపై….
మొగల్తూరు – పశ్చిమ గోదావరి జిల్లా?

మిరెము గింజ చూడ…

ప్రచురించిన వర్గము Uncategorized — Dr.Ismail Penukonda @ 12:13 పూర్వాహ్నం

మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
కొఱికి చూడ లోఁనజుఱుకు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా!
విశ్వదాభిరామ! వినురవేమ!

సెప్టెంబరు 17, 2007

అరచేతిలో ప్రపంచం: ఐఫోన్ – బెంజమిన్ ఫ్రాంక్లిన్ ‘ఈల’?

ప్రచురించిన వర్గము ఈల, ఐఫోను, ఫ్రాంక్లిన్ — Dr.Ismail Penukonda @ 11:39 అపరాహ్నం

ముందు ఫ్రాంక్లిన్ ‘ఈల’ సంగతి చూద్దాం…అంటే చదువుదాం! వంద డాలర్ల నోటుమీద నవ్వుదామా, వద్దా అనే మీమాంసలో ఉన్న ఈ అమెరికా పెద్దాయన తన చిన్నప్పటి సంగతిని ఇలా బ్లాగీకరించాడు…”నేను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఓసారి పెద్ద పండుగ వచ్చింది. నా స్నేహితులు, పెద్దలు నాకు దండిగా రాగి నాణేలు ఇచ్చారు. ఇక చెప్పేదేముంది హుషారుగా ఈల వేసుకొంటూ మా ఊర్లోని బొమ్మల అంగడికి పరుగెత్తాను. అక్కడ కనిపించిన ‘ఈల’ ను చూసి మనస్సు పారేసుకొన్నాను. నా మిత్రుల దగ్గర అప్పటికే చూసి ఉండడం వల్ల వెంటనే కొనాలనిపించి నా దగ్గర ఉన్న సొమ్మంతా అంగడి వాడికిచ్చి ఆ ‘ఈల’ను సొంతం చేసుకొని ఇల్లంతా వినపడేలా తిరుగుతూ నానా అల్లరి చేశాను. కానీ కాసేపట్లోనే మా బావలూ-బామ్మర్దులూ, అక్కలూ-తమ్ముళ్లూ అందరూ, నేను ఆ ‘ఈల’ విలువ కన్నా నాలుగింతలు ఎక్కువగా ఖర్చు పెట్టాననీ, ఆ పైకానికి ఇంకా బోలెడు బొమ్మలొచ్చేవనీ చెప్పగానే నా ఉత్సాహం అంతా నీరుగారి పోయి, లేని బాధ మొదలయ్యింది. అందుకే ఆ పిమ్మట ఎప్పుడూ ఏదైనా అనవసర వస్తువు కొనేముందు “ఈ ఈల విలువెంత?” అని నన్ను నేను ప్రశ్నించుకొనడం అలవాటయి చాలా డబ్బు ఆదా చేసాను.”

- బెంజమిన్ ఫ్రాంక్లిన్ “ద విజిల్” (రచనా కాలం:1779) కు స్వేచ్ఛానువాదం.
ఈ రోజు పని మీద గ్రంథాలయం వెళ్లినప్పుడు చిన్నప్పటి ‘బెన్’ పాలరాతి విగ్రహం కింద ఈ కథ చదవగానే మొన్నటి ‘ఆపిల్’ కథ గుర్తుకొచ్చింది. తొందరగా కొనాలన్న ఆతృతలో రెండు వందల వరహాలు నష్టపోయి ‘చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు’ మరో వంద వరహాల ఆటబొమ్మలయినా దక్కాయని తృప్తిపడ్డ ‘ఫ్రాంక్లిన్’లూ గుర్తుకొచ్చారు… ఆగండాగండి అక్కడికే వస్తున్నా, ఇంకొన్నాళ్లు ఆగు నాయనా ‘నవ్విన నాపచేనే పండుతుంది’ అనుకొంటున్నారు కదూ! అలాగే కానివ్వండి. కానీ నిజంగా అరచేతిలో ప్రపంచం ఈ ఫోను. కానీ వచ్చిన చిక్కల్లా తెలుగు చూడ్డానికి, చదవడానికీ వీలు లేకపోయింది. అందుకే ప్రారంభోత్సవం ఇలా తెలుగు వల్లభుడితో కానిచ్చేశాను!
తరువాతి కాగితం »

WordPress.com లో Blog పెట్టుము.