
నీ కళ్ళు…
బీడువారిన ఈ బండ గుండెల పై,
ప్రేమ వర్షం కురిపించే నీలిమేఘచారికలు!
నీ కళ్ళు…
నీ తలపులతో నిత్యం తల్లడిల్లే నా మదిని,
సృశించి, లాలించి, పాలించే మలయమారుతవీచికలు!
నీ కళ్ళు…
మృతమైన ఈ శూన్య మనస్సును,
అమృతధారలతో నింపే నిండు గిన్నెలు!
నీకళ్ళు…
తెల్లటి రాత్రి పై వికసించే…నల్లటి చందమామలు!
- ఇస్మాయిల్ పెనుకొండ.
ఛాయాచిత్ర సౌజన్యం : అభిసారిక

ఇండియా
ఇంతింతై వటుడింతై పెరుగుతున్న ప్రబల ఆర్థిక శక్తి!
డిగ్గున ఎదుగుతున్న సాంకేతిక, సైనిక, రాజకీయ యుక్తి!
యావత్తు విశ్వానికి ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న అభివ్యక్తి!
- ఇస్మాయిల్ పెనుకొండ.
(ముంబయి బాంబుదాడుల బాధితులకు అశ్రుతర్పణాలతో…)

“చనిన నాళుల తెనుగు కత్తులు
సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ” .
“రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన
ఆంధ్ర,కన్నడ రాజ్యలక్ష్ముల కరితి నీలపు దండ,ఈ పెనుగొండ కొండ ‘.
“వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు
పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ,ఈ పెనుగొండ కొండ”.
“తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు
నిరుపమ ద్రాక్షారసంబులునిండి తొలికెడు కుండ,ఈ పెనుగొండ కొండ”.
- తిరుపతి వేంకట కవులు.
నీకు తెలుసు…
కళ్లు మాట్లాడుతాయని…
కళ్లు నవ్వుతాయని…
కళ్లు ప్రేమ వర్షం కురిపిస్తాయని…
కానీ నీకు తెలియంది ఒక్కటే…
కళ్లు ఏడుస్తాయి కూడా !!!
- ఇస్మాయిల్ పెనుకొండ.
తూర్పున నీవు…
పడమర నేను…
ఉత్తర దక్షిణ ధృవాలైనాము!
- ఇస్మాయిల్ పెనుకొండ