చింతు

మార్చి 31, 2007

మన విహారి ‘జ్యోతి’లో!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 4:32 సా.

కొలరాడో, మార్చి 30: కొలరాడోలో జరిగిన ఉగాది వేడుకలలో పిల్లలే ప్రధాన ఆకర్షణగా నిలిచి పెద్దల అభిమానాన్ని చూరగొన్నారు. పిల్లలు ప్రత్యేకంగా ప్రదర్శించిన రామయణం నృత్యరూపకం రామయణ ఘట్టాలను కళ్ళ ముందు వుంచింది. చిట్టి పొట్టి బాల బాలికలు చేసిన ముగ్గుల పాటల నృత్యాలు, పద కవితా గోష్టులు, పంచాంగ శ్రవణాలు, నోరూరించే వంటలు, వివాహ భోజనంబు, ఘటోత్కచ ఘట్టాలు ఆహుతులను మైమరిపింప జేశాయి. ఇంకా ముద్దు ముద్దుగా తీపి పలుకులు పలికే బాలలు వల్లె వేసిన ‘ఉప్పు కప్పురంబు’ వంటి పద్యాలు పద్యం వచ్చిన వారిని ఆనందడోలికల్లో ముంచెత్తింది. అలాగే సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ కుమార్తె చిరంజీవి సంస్కృతి ఆలపించిన ‘ఎవ్వరితో మాటలాడుకోవాలి’ కూడా ప్రేక్షకులను కదలించింది.

ఇంకా కొలరాడోలో తెలుగు సంఘం నిర్వహించిన ఈ సర్వజిత్‌ ఉగాది సంబరాల్లో ప్రముఖ గాయకుడైన గజల్‌ శ్రీనివాస్‌ పాడిన తెలుగు గజల్‌ గానం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్దలు వీలైనంత వరకూ తమ సమయాన్ని పిల్లలతో గడపాలని తల్లిదండ్రులకు సూచిస్తూ పాడిన గజల్‌, ‘పాపాయి ముద్దిస్తే ప్రేమించినట్టే’ అన్న మరో గజల్‌ ప్రేక్షకులను ఆకర్షించింది. విదేశాలలో వున్న తన బిడ్డను గుర్తు చేసుకుంటూ అమ్మ పాడుకునే సి.నా.రె. పాట, ‘ఇంకా పొట్ట చేత పట్టుకుని’ అన్న గీతం శ్రోతలను ఆకట్టుకున్నాయి.

రామారావ్‌ కలగర చేసిన మిమిక్రీ సభికులను కడుపుబ్బ నవ్వించింది. సంఘం సాంస్కృతిక కార్యదర్శి భూపతి విహారి దోనిపర్తి మాట్లాడుతూ క్రిందటి సర్వజిత్‌ నామ సంవత్సరం వచ్చినప్పుడే భారతావనికి స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. డా.గజల్‌శ్రీనివాస్‌ గారికి దుశ్శాలువని కప్పి జ్ఞాపికను అందజేసిన సన్మాన కార్యక్రమంలో ప్రసాద్‌ ఓరుగంటీ, మూర్తి గరిమెళ్ళ మరియు ఫణి కోలరాజు పాల్గొన్నారు. ఇంకా సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రకాష్‌ వరద, మోహన్‌ కోనేరు, శ్రీనివాస్‌ నల్లపాటి ప్రభతులు పాల్గొన్నారు. అత్యంత ఘనంగా చెయ్యబడ్డ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ప్రత్యూష అప్పరసు, శ్రీనివాస్‌ వళ్ళెం వ్యవహరించారు. సంఘం అధ్యక్షుడు ధర్మ అప్పరసు తొలుత అధ్యక్షోపన్యాసం చేయడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరిస్తూ ముగిశాయి.

(ఆంధ్రజ్యోతి నుంచి)

మార్చి 26, 2007

వేప చెట్టు – చింత చెట్టు.

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 4:34 ఉద.

చాన్నాళ్ల నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ…ఇంకా బెంగ తీరకున్నా… కనీసం ఇలా అయినా బ్లాగు నీడన సేదదీరుదామని నాకిష్టమైన రెండు చెట్ల కథ చెప్పడానికి వచ్చాను. ఆలకించండి! చెట్టుతో నా పేరుకు రెండు బాదరాయణ సంబంధాలున్నాయి. ఒకటి- ‘చెట్టు ఇస్మాయిల్’గా లబ్ధప్రతిష్టుడైన కవిగారి పేరు నా పేరు ఒకటి కావడం. రెండు- ‘చింతు’ అన్న నా ముద్దుపేరుకు ‘చింత’ చెట్టుతో ఉన్న చుట్టరికం. అదే కాక చిన్నప్పుడు నన్ను ఏడిపించడానికి అందరూ ‘చింతొక్కు’, ‘చింతకాయ్’ వగైరా పదబంధాలతో నాతో ఆడుకోవడం.
నాకిష్టమైన చెట్లలో ‘వేప’ది అగ్రస్థానం. మండువేసవిలో, పల్లెపట్టున చల్లని వేపచెట్టునీడన, నవారు మంచం వేసుకొని ఓ కునుకు తీస్తే…అబ్బో ఆ హాయే వేరు. వేపాకు గాలిలోనే ఆ గమ్మత్తు ఉన్నదేమో తెలియదు. కానీ ఇప్పుడు వేపాకునూ పేటెంట్ చేసే రోజులొచ్చేసాయి. మనం గమనిస్తే గ్రామసీమల్లో ‘వేపాకు’కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ఉదా. జాతరల్లో, ఆరోగ్య సంబంధ విషయాల్లో. ఇంకా ఊర్లల్ళో పీర్లచావడిగా ఉపయోగపడేది వేపచెట్టే. షిర్డీ సాయి తన జీవితంలో చాలా భాగం వేపచెట్టు కిందే జీవించాడట. ఇక వేప గురించి ప్రస్థావన వచ్చినప్పుడు ‘చేదు’ గుర్తు రాకమానదు. అలాగే వేమన్న ‘తినగ తినగ వేప తియ్యనుండు’ కూడా. నా చిన్నప్పుడు మా పిల్లగుంపు అంతా పండిన వేపకాయలు రుచి చూసేవాళ్లం. ఇక వేపపువ్వు లేని ‘ఉగాది పచ్చడి’ మనం ఊహించలేము. ఏదైతేనేం ఈ ఉగాది కాస్త చేదుగానే మొదలైంది తీయటి తేనె(హనీ) రుచి చూశాక!
ఇక ‘చింత’ చెట్టుకు చాలా కథ ఉంది. నేను నాలుగవ తరగతిలో అనుకొంటా…ఓ రాత్రి మా అమ్మ ట్యూషన్ అయ్యాక పిల్లలంతా ఒక్కరొక్కరే బయటకు వెళుతున్నారు, మా ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న ‘చింత చెట్టు’ క్రింద అందరూ గుమిగూడారు. ఆపుకోలేని ఆసక్తితో నేనూ వెళ్లాను. మా అందరిలో పెద్ద కుర్రాడు ఓ చింత బర్ర చేతిలో పట్టుకొని ‘అదిగో…అక్కడ తెల్లగా కనిపిస్తూందే అదే దెయ్యం బాగా చూడండి’ అని అందరికీ చూపిస్తున్నాడు. నాకేమో పై ప్రాణాలు పైనే పోయాయి…కారణం అక్కడ వాడు చెప్పినట్టే ఓ కొమ్మ మీద తెల్లగా మెల్లగా కదలుతూన్న దెయ్యం కనపడింది…ఇక్కడ కత్తిరిస్తే…ఆ దెబ్బకు పొద్దున కల్లా 102 జ్వరం! ఇప్పటికీ అది తలచుకొంటే ఒక రకమైన గగుర్పాటు కలుగుతుంది. కానీ ఇప్పుడు అనిపించేదేమిటంటే అక్కడ ఏ పాతబట్టనో తగులుకొని ఉంటుంది గాలికి కాస్తా రెపరెపలాడి ఉంటుందని.
చింత చెట్టు నుంచి కాస్త పక్కకెళ్లినట్టు ఉన్నాను కానీ చింత చెట్టుతో ఉన్న అనుబంధమే అదీ. ఇక చింతొక్కు, చింతచిగురు పప్పు…ఆహా అద్భుతం, అమోఘం. మా ఊరి చెఱువు గట్టున ఉన్న చింతచెట్టు కొమ్మలెక్కి ఆడుకొన్న ఆటలు, గురి చూసి కొట్టి రాల్చిన చింతకాయలు, కుప్పలు కుప్పలు పోసి తిని,తిని నోరంతా పొక్కిపోయి పడ్డ బాధలు…అన్నీ గుర్తొస్తాయి. తిన్న తరువాత మిగిలిన చింతగింజలను పగులగొట్టి, అరగదీసి వాటితో ఆడిన పరమపదసోపానపటములు, బారాకట్టలు అన్నీ మధురానుభూతులే. కొమ్మకు ఊయలేసి ఊగిన ఊసులు…అన్నీ తలచుకొంటూంటే అదీ ఈ నవవసంత సమయంలో ఇప్పటికిప్పుడు మళ్లీ బాల్యానికి వెళ్లాలని అనిపిస్తూంది. ఎవరో అన్నట్టు ‘నా బాల్యాన్ని నాకిచ్చేయి…నా సమస్తమూ నీకిచ్చేస్తా’ (సినారె?). ఇక చివరగా చెట్టు ప్రాముఖ్యాన్ని రెండు ముక్కల్లో చెప్పాలంటే “చెట్టంత కొడుకు” అన్న నానుడి చాలు!

మార్చి 16, 2007

‘పెళ్లి’ పెటాకులయ్యింది!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 2:02 ఉద.

నా ఉన్నతవిద్యా ఫలితాలు మొన్ననే వచ్చాయి. ‘మ్యాచ్’ అనబడే ఈ జూదంలో నేను ఈసారి ఓడిపోయాను. మళ్లీ శక్తి కూడగట్టుకొని ప్రయత్నించాలి. ఎన్నెన్నో చోట్లకు వెళ్లి, అన్నీ బాగానే చేసినా, మూడేళ్ల కష్టం (క)న్నీళ్ల పాలయ్యింది. ఏం చేద్దాం “నా పెళ్లయ్యిందోచ్” అని సంబరంగా అందరితో ఇక్కడే చెప్పుకోవాలని అనుకొన్నాను. కానీ ఇలా పెళ్లి(మ్యాచ్) పెటాకులయ్యింది అని డప్పు కొట్టుకోవాల్సి వస్తోంది.

కానీ ఇక్కడో విషయం చెప్పాలి. నాకు ఈ కష్టకాలంలో ఎంతో మానసిక స్థైర్యాన్ని, నా ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ధైర్యాన్ని ఇచ్చిన బ్లాగు మిత్రులకు, తెలుగు బ్లాగుకు నా కృతజ్ఞతలు. విజయం సాధించి ఉంటే ఆ కథే వేరుగా ఉండేది. కానీ “అనుకున్నామనీ జరగవు అన్నీ, అనుకొలేదనీ ఆగవు కొన్నీ…జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని!” అని పాడుకొంటున్నా ఇప్పుడు. ఇదే కారణం నా నిశ్శబ్ధానికి!

మార్చి 8, 2007

నేను ‘ఆడపిల్ల తండ్రి’ని అయ్యానోచ్!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 10:23 సా.

మార్చి 8వ తేది, క్రీస్తు శకం 2007వ సం. ఉదయం గం.8:19 ని. కు మాకు పుత్రికోదయం అయ్యింది. శాలివాహన శకం 1929, వ్యయ(:-)) నామ సంవత్సరం, ఫాల్గుణ మాస, బహుళ పంచమి రోజు, స్వాతి నక్షత్రంలో ఈ ‘వెన్నెల’ విరిసింది. హిజరి 1429, సఫర్ నెల 18వ తారీఖున మా ‘భాను’ కన్నులు తెరిచింది. ఈ శుభ సందర్భంలో అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవడం కాస్త ఆలస్యమైనా మీ శుభాశీస్సులు కోసం ఇలా!

అన్నట్టు ఈ హడావుడిలో పడి మరిచాను, మార్చి 8న ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మన బ్లాగు మహిళా లోకానికంతటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ‘ఇదే’ రోజు ఓ ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి, క్రిస్టియన్ (దాదాపుగా) దేశంలో, యూదు(బెత్ ఇజ్రాయేల్) హాస్పటల్లో పుట్టిన ఈ అమెరికా అమ్మాయి/జెర్సీ గర్ల్/తెలుగు చిన్నారి ‘అంతర్జాతీయ మహిళ’గా ఎదగాలని ఈ నాన్న కోరిక/దీవెన.

ఇక పేరు విషయానికొస్తే, నేను తొమ్మిదో తరగతిలో చదువుతూన్నప్పుడే ఓ తెలుగు నవల చదువుతూ ‘పెద్దయ్యాక నాకు కూతురు పుట్టాలని, పుడితే ‘స్నిగ్ధ’ అనే పేరు పెట్టాలని’ అనుకొన్నాను. మళ్లీ కొన్ని సార్లు ‘వెన్నెల’ అయితే బాగుంటుందని భావించాను, బ్లాగు మిత్రులూ చాలా పేర్లు సూచించారు, కానీ మా ఆవిడ అభిప్రాయానికీ ‘విలువ’ ఇవ్వాలిగా, మా అమ్మ కూడా ఓ పేరు సూచించింది, ఇక నక్షత్రం ప్రకారం కొన్ని.

సుస్మిత (మా ‘చిరు’ కుమార్తె), సుహానా (మా వాడి పేరు సుహాస్ కదా), రోషిణి (నక్షత్ర దృష్ట్యా), హాసిని (మావాడు బొమ్మరిల్లు చూసినప్పటి నుంచీ చెల్లెలు పేరేంట్రా అంటే ఇదే అంటాడు!)…ఇలా ఆలోచించి, ఆలోచించి చివరకు ‘శ్రేయ సుహేల్ పెనుకొండ’ అని, ముద్దుగా ‘హనీ’ అని పిలవాలని (మా వాడిని ‘హాసూ’ అంటాం) నిర్ణయించడమైనది:-)

కొద్ది రోజుల్లో వెలువడనున్న నా ఉన్నత విద్య ఫలితాలకే కాకుండా, అందరికీ ‘శ్రేయస్సు’ కలిగించే ‘శ్రేయ’ కావాలని, ‘సుహేల్’ అంటే కానోపస్ లాగా ఓ ‘నక్షత్ర సముదాయం’ మరియు నా మధ్యనామం(మిడిల్ నేమ్), అలా అన్నీ కలసి వచ్చేలా ఈ పేరు పెట్టాను. అమ్మ పోలికలెక్కువ ఉన్నా చివరికి నాన్న గారాలపట్టీయేగా! తల్లి, బిడ్డా క్షేమం.

మార్చి 5, 2007

ఇంట గెలిచాం…ఇక రచ్చ గెలుద్దాం: దేశిపండిట్!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 11:28 సా.

తెలుగు బ్లాగ్లోకం వింటిని వీడిన బాణంలా రివ్వున దూసుకుపోతోంది. ఎన్నెన్నో కొత్త బ్లాగులు, కొంగ్రొత్త టపాలతో కూడలి, తేనెగూడు కళకళలాడుతున్నాయి. తెలుగు బ్లాగులకు ఈ అంతర్జాలంలో ఘనమైన గుర్తింపు కూడా ఉంది. కానీ ఇవన్నీ మన తెలుగు వారికే తెలుసు, మిగతా ప్రపంచానికి మన తెలుగు బ్లాగుల వాడి-వేడి తెలియజెప్పడమెలా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. వీవెన్ ‘క్రాస్ రోడ్స్’ తో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు.

అలా నేనూ కొంత ఆలోచించాను. ఇంతలో…మొన్న ఇండీబ్లాగీస్ పోటీలో నెగ్గిన పలు బ్లాగులు చదువుతున్నప్పుడు ‘ఉత్తమ బ్లాగు వేదిక’ మరియు ‘ఉత్తమ రూపకల్పన’ పోటిలో విజయం సాధించిన ‘దేశిపండిట్‘ బ్లాగు నన్నాకర్షించింది. వైవిధ్యమైన పలు భారతీయభాషల బ్లాగులను ఒకచోట చేర్చి పాఠకులకు అందజేసే ఈ వినూత్నమైన ఒరవడి నచ్చి అక్కడ మన బ్లాగుల కోసం చూస్తే కన్నడ,తమిళ,మరాఠీ,బెంగాళీ,హిందీ బ్లాగులుండి ‘తెలుగు’ బ్లాగులు లేకపోవడంతో మనస్సు చివుక్కుమంది.

వెంటనే ‘దేశిపండిట్’ వ్వవస్థాపకుడైన ప్రతీక్/పాట్రిక్స్ కు ఓ ఈ-లేఖ పంపాను. తను కూడా అమిత ఆసక్తితో తెలుగు బ్లాగులను ఆహ్వానిస్తూ, తెలుగు బ్లాగుల నిర్వాహకుడిగా నాకు అవకాశమిస్తూ, మన తెలుగు బ్లాగ్ప్రపంచానికి ఘనస్వాగతం పలికారు. మనకున్న తెలుగు బ్లాగులకు ఓ కూడలి, మరో తేనెగూడు ఉన్నా ఈ ‘దేశిపండిట్’ ముఖ్యోద్దేశం, ఉన్న వందల బ్లాగుల్లో నుంచి ఉత్తమమైన ‘టపా’లను సేకరించి తెలుగులో, ఆంగ్లంలో చిన్న వ్యాఖ్యానంతో ప్రపంచానికి పరిచయం చేయడం. ఇక్కడ మన బ్లాగుల్లోని వైవిధ్యాన్ని తెలుగువారితో పాటు, తెలుగు మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజెప్పటం ద్వారా మనకు తెలియని చాలా మందికి ఉత్సుకత కలుగజేయవచ్చు.

ఆరులక్షలకు పైగా హిట్లతో, నెలకు అరవైవేలకు పైగా పుటల వీక్షణ కలిగిన ‘దేశిపండిట్’లో ఇలా తెలుగు బ్లాగులను పరిచయం చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ… ఈ విషయంలో మీ సహాయసహకారాలను ఆశిస్తూ…ఈ శుభవార్త మీతో ఇలా పంచుకొంటున్నాను. ఈ సోమవారం నుంచి ప్రారంభించిన ఈ ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలనీ, ఇది ఇంకా ఆరంభం మాత్రమే కాబట్టి మిగతా టపాలను తొందర్లో చూస్తారనీ, కనీసం వారానికి కనీసం ఏడు ఆపై ఆణిముత్యాలను మీకందించాలని నా ప్రస్తుత ప్రణాళిక. నా చూపు దాటిపోయిన ఆసక్తికర టపాలను మీరూ ఇక్కడ సూచించవచ్చు.

సాలభంజికల ‘నాగరాజు’ గారు, మన ‘రానారె’, ఐశ్వర్యారాయ్!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 2:39 ఉద.

ఇదేంటీ ఈ బ్లాగు మకుటం వైవిధ్యంగా ఉంది అనుకొంటున్నారా? ఆగండాగండి చెబుతాను. ఇప్పుడే ‘బంటీ ఔర్ బబ్లీ’ అనే హిందీ చిత్రరాజాన్ని చూశాను. ఇంతకు ముందే చూసినా మా వాళ్లు చూస్తోంటే, నేను ‘కజరారే…కజరారే’ గీతం మాత్రం చూశానన్న మాట. ఆ పాటను చూడాలనుకోవటంలో నా ఉద్దేశ్యమైతే… అప్పటికి తెలియకున్నా, ఇప్పుడు మొగుడు-పెళ్లాలు కాబోతున్న ‘అభిషేక్-ఐశ్వర్య’, మామ-కోడలు కాబోతున్న ‘అమితాబ్-ఐశ్వర్య’లను ఆ పాటలో ఉత్సాహంగా చేసిన నృత్యాన్ని చూసి మురిసిపోదామనే!

కానీ ఆ పాట చూస్తూంటే ఐశ్వర్యారాయ్ అయితే కన్పించింది కానీ…విచిత్రంగా నాకు అమితాబ్ స్థానంలో మన ‘నాగరాజు’గారు, అభిషేక్ స్థానంలో మన ‘రానారె’ వీరవిహారం చేస్తున్నట్టు కాన్పడింది:-) మీరు నమ్మకపోతే ఇక్కడ, మరియు ఇక్కడా నొక్కండి, అందులో వారి చిత్రాలను చూశాక మళ్లీ ఇక్కడ ఘాట్టిగా మరోమారు నొక్కండి! నేను చెప్పింది తప్పంటారా? మరి ‘పచ్చకామెర్లు’ వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు (అది నిజం కాకపోయినా) ఈ బ్లాగు కామెర్లు వచ్చాక లోకంలో ఏది చూసినా బ్లాగెయ్యాలనీ, లేదా ఎవరిని చూసినా మన బ్లాగ్మిత్రులు కన్పించడం మొదలయ్యింది:-) దీనికి మందేమిటి చెప్మా?

(ఇందుమూలంగా యావన్మంది తెలుగు బ్లాగు ప్రజానీకానికి తెలియజేయునదేమనగా ఇది నా పుర్రెలో పుట్టిన అవిడియాకు బ్లాగు రూపమని, హాస్యానికే గానీ అపహాస్యం చేయడానికి కాదనీ తెలుసుకోవలసిందిగా ప్రార్థన.)

మార్చి 4, 2007

గ్రహణం మొర్రి – వైద్యసహాయం!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 3:33 ఉద.

నిన్న ఇక్కడ మాకు చంద్రగ్రహణం. అది చూశాక నేను మీతో చెప్పాలని మరచిపోయిన ఓ మంచి విషయం గుర్తొచ్చింది. కడుపుతో ఉన్న వాళ్లు గ్రహణం రోజు బయట తిరగకూడదని, లేకపోతే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ వస్తుందని మన పెద్దవాళ్లు అంటూంటారు. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ గ్రహణం మొర్రి అని మనం పిలిచే “క్లెఫ్ట్ లిప్” మరియు “క్లెఫ్ట్ పాలట్” లకు కారణం అయితే అది కాదు. బయటకు ఆ ఒక్కరోజు వెళ్లకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదనుకోండి అది వేరే సంగతి.

గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకొనే ఆహారంలో పోషక పదార్థాలు లోపించినా, కొన్ని రకాల విటమిన్లు తగ్గినా ఇలాంటివే కాక వెన్నుపాము దెబ్బతినే అనేక అవకరాలు వస్తాయి. వీటిలో కొన్ని ప్రాణాంతకం కూడా. మరీ ముఖ్యంగా విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, పాలు గర్భంతో ఉన్న మొదటి నెలల్లోనే మొదలుపెట్టాలి. అలాగే ‘ఫోలేట్’ అన్న విటమిన్ మాత్రలు కూడా తీసుకోవాలి.

ఇలాంటి అవకరాలే కాకుండా ఇంకా దారుణమైన అంగవైకల్యాలు కల ఎంతో మందికి ప్రవాస భారతీయుడైన డా.లిఖిత్ రెడ్డి ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి వారికి కొత్త జీవితాన్నిస్తున్నారు. మన హైదరాబాదుకు చెందిన ఈయన అదే నగరానికి చెందిన ప్రొ.శ్రీనివాస గోశల్ రెడ్డి మరియు డా.రాజ్ రెడ్డిలతో కలిసి చేసిన కొన్ని శస్త్రచికిత్సలు మొన్న డిస్కవరీ ఛానల్ వారు ప్రసారం చేస్తే చూశాను. మీరు కూడా చూడాలంటే…(సూచన: కొన్ని చిత్రాలు, వీడియో మీరు చూడలేకపోవచ్చు. కాబట్టి రక్తం చూడ్డానికి ఇబ్బంది పడేవారు చూడకపోవడమే మంచిది) ముఖం సరిగాలేని ‘సురేష్ బసగాని’కి చేసిన శస్త్రచికిత్స ఈ లంకెలలో {వీడియో-1, వీడియో-2 }చూడండి. ఈ లంకెలో గ్రహణం మొర్రి మొదలైన వాటి చిత్రాలు చూడొచ్చు.

ఇక వీరు నడుపుతున్న “జి.ఎస్.ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రేనియో ఫేషియల్ సర్జరీ” సైదాబాద్ లో ఉంది. మీకెవరైనా ఇలాంటి అభాగ్యులు తటస్థపడితే ఇక్కడికి పంపండి లేదా చిరునామా/ఫోన్ నెం. ఇస్తే వారే బస్సు వేసుకొని వచ్చి పేదవారికి ఉచిత వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రహణం మొర్రియే కాకుండా ఇంకా అన్ని రకాల ముఖవికృతులకు వీరు వైద్యం చేస్తున్నారు. వీరి ఈ ప్రయత్నం అభినందనీయం!

(చదువరి గారూ…ముక్కు పెరిగిన బాలుడి గురించి తెలిస్తే ఈ సమాచారం వారికందించండి. టు మేక్ ఎ ఢిఫరెన్స్ సభ్యులకు కూడా తెలియజేస్తాను.)

మార్చి 3, 2007

‘పరిణీత’ – ఓ దృశ్య కావ్యం!

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 3:38 ఉద.

‘పరిణీత’- పెళ్లయిన ఓ స్త్రీ కథ. మళ్లీ ఒక అద్భుతమైన సినిమా చూసే భాగ్యం లభించింది. బెంగాళీ బాబు ‘శరత్చంద్ర ఛటర్జీ’ నవలకు తెర రూపం ఈ చిత్రం. నిర్మాత, దర్శకుడు, నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం తగిన న్యాయం చేసారనే భావిస్తున్నాను. రాజసం ఉట్టిపడే 1962 కలకత్తా నగరం, కళ్లు జిగేల్ మనే దుస్తులు, కళ్లకింపైన ఛాయాగ్రహణం, చెవులకింపైన పాటలు, చవులూరించే సంగీతం, మురిపించే నటన, ముచ్చటగొలిపే దర్శకత్వం అన్నిటినీ మించిన కథ. ఓహ్…ఏమి అనుభూతి!

‘విధు వినోద్ చోప్రా’ సాహసానికి జోహార్లు. ఎంత నమ్మకముంటే ఇలాంటి ‘క్లాసిక్’ మీద అంత పెట్టుబడి పెడతాడు. అతని అన్ని సినిమాలు సరుకుండేవే! దర్శకుడు ‘ప్రదీప్ సర్కార్’ ఎంతో శ్రమకోర్చి ఈ కళాఖండానికి జీవం పోసాడు. సంగీత దర్శకుడు ‘శంతను మొయిత్రా’ నా అభిమాన ‘భూపేన్ హజారికా’ను గుర్తుకు తెచ్చాడు. ఛాయాగ్రాహకుడు ‘నటరాజ సుబ్రమణియన్’ చక్కనైన పనితనాన్ని చూపాడు. ఇక నటీనటుల సంగతి చెప్పేదేముంది, ఛోటే నవాబ్ ‘సైఫ్ అలీ ఖాన్’ ఎంతో హుందాగా నటించాడు, చిన్న పాత్ర అయినా విషయమున్నపాత్రలో ఎప్పటిలాగే ఒదిగిపోయాడు సంజయ్ దత్.

‘దేవదాసు’ రాసిన ఆయనే ఇదీ రాసాడంటే…చెప్పను సినిమా చూడండి మీకే తెలుస్తుంది. స్త్రీ హృదయాలను పట్టి వడపోచిన ఘనత ‘శరత్’ సొంతం. వారిలో ఉన్న భావాలను విప్పి చెప్పి వాటి నిజమైన విలువను వారికే తెలియజెప్పిన నవలాకారుడు ‘శరత్’. ఇక ఈ సినిమాలో ప్రేమ, ఈర్ష్య, మోసం, ద్వేషం, దురాశ…లాంటి ఎన్నో మనోభావాలను ముసుగు తీసి మరీ చూపిస్తాడు రచయిత. ప్రేమలో జ్వలించే కథానాయకుడు, కథానాయిక నిస్సహాయత, వారి మధ్య తలెత్తే అపనమ్మకాలు, దోబూచులాటలు…వేసవిలో రాత్రి వీచే చిరుగాలిని మన మనస్సులో అనుభవించేలా చేస్తాయి.

ఇక ‘విద్యా బాలన్’ అందం నా కళ్లు తిప్పుకోనివ్వలేదు. ‘లగేరహో…’లో మెరుపులు మెరిపించిన ఈ మెఱుపుతీగ తన మొదటి చిత్రంలోనే ఇంత పరిణతి చెందిన నటన ప్రదర్శిస్తుందనుకోలేదు. ‘పాలక్కాడ్’ కు చెందిన ఈ ముద్దుగుమ్మ పాలనురుగు లాంటి శరీరలావణ్యంతో, వంకీలు తిరిగిన చెవి రింగులతో ఉన్న తలకట్టుతో, బంగారు రంగు మేని ఛాయతో, అంతకు మించిన సంస్కారంతో ‘శరత్చంద్ర’ నవలలోని నాయికను మన ముందు నిలిపింది. నాకు నచ్చిన నటీమణుల్లో సావిత్రి, సుహాసిని, సౌందర్య, లయ, కొత్తగా ప్రియమణి:-) కోవలోనికే చెందుతుంది ఈ బాలామణి!

ఇక ఇది చాలదన్నట్టు మూన్ మూన్ సేన్ పుత్రికా రత్నం ‘రైమా సేన్’, ఒక పాటలో తళుక్కున మెరిసే ‘రేఖ’, మన హైదరాబాదీ ‘దియా మీర్జా’…అబ్బో చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఎంతైనా హిందీ చిత్రరంగాన్ని మన దక్షిణాది తారలయిన జయప్రద, వహీదా రెహమాన్, టబు-(తెలుగు), శ్రీదేవి, హేమమాలిని, రేఖ -(తమిళం), ఇప్పుడు ఈ విద్యాబాలన్-(మళయాళం) ఒక్క ఊపు ఊపారు/ఊపుతున్నారు.

మార్చి 2, 2007

హిందూపురం ఛైర్మన్ ‘అనిల్ కుమార్’

Filed under: Uncategorized — Dr.Ismail Penukonda @ 8:01 సా.

ఈ మధ్య మా హిందూపురం వార్తలు చూడలేదు కానీ నిన్న చూస్తే తెలిసింది. ఈసారి మునిసిపల్ ఎన్నికలలో హిందూపురం పురపాలకసంఘం ఛైర్మన్ గా ‘అనిల్ కుమార్’ కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యాడని! అనిల్…ఈ సందర్భంగా నీకు నా శుభాకాంక్షలు.

నాకు రాజకీయాల మీద ఆసక్తి లేకున్నా ఈ విషయం నా బ్లాగులో రాయడానికి కారణం…చిన్నప్పుడు ఒకే వీధిలో ఉంటూ కలిసి గోళీలాడుకొన్నవాడిగా ‘అనిల్’ తెలుసు కాబట్టి. హిందూపురంలో ‘ముక్కిడిపేట’ (ముక్కిడమ్మ అనే ఆవిడ పేరు మీద ఉన్న పేట అట!)లో మేము నివసించేటప్పుడు ఈ అనిల్ వాళ్ల ఇల్లు మా ఇంటికెదురుగా ఉండేది. అప్పటి నుంచే అనిల్ వాళ్ల నాన్న కాంగ్రెసు నాయకుడు.

మా అమ్మ చెబితే తెలిసింది అప్పట్లో ఎన్నికలప్పుడు వీడితో పాటు నేనూ కాంగిరేసు జెండా పట్టుకొని పరుగెత్తేవాడినని(పిల్ల చేష్టలు కదా!). కానీ ఆ తర్వాత ‘ఎన్టీవోడు’ రాజకీయాలలోకి వచ్చాక, ఎన్.టి.ఆర్ వీరాభిమానిగా మా నాన్న షామియానా వేసి ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా!’ అంటూ తెలుగుదేశం ఎన్నికల డేరా వేశాక, నేను వీరావేశంతో ఈ సారి పసుపుపచ్చ జెండా, షర్టుకు ఎన్టీయార్ బొమ్మ తగిలించి తిరిగేవాడిని.

మొత్తానికి ఇలా 31 ఏళ్ల వయస్సులోనే ఓ రాజకీయ పదవికెక్కాడు నా సహాధ్యాయి. ఇప్పుడు నాకే రాజకీయ పార్టీ పైనా అభిమానం లేకపోయినా తెలిసిన వాడికి మంచి జరిగినప్పుడు అభినందించాలని ఇలా. ఇక పైనున్న చిత్రం హిందూపురం నడిబొడ్డున ఉన్న ‘టూరిస్ట్ లాడ్జ్’. ఎన్నో ఎన్నికలలో తెదేపాకు పార్టీ కార్యాలయంగా ఉండేది. పక్కనే నేను పుట్టిన ప్రభుత్వ వైద్యశాల బోర్డు కూడా లీలగా కనిపిస్తోంది చూడండి!
(చిత్రసౌజన్యం: చింతు)

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.