చింతు

డిసెంబర్ 12, 2007

తెలుగు ప్రజా హృదయాధినేత!

తెలుగు ప్రజలకు చరిత్ర సృష్టించే మరో అవకాశం వచ్చింది. మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకం తమ హృదయాంతరంగాన్ని అవలోకనాల్లో బహిర్గతం చేస్తోంది. పైనుంచి అంతా చిద్విలాసంగా గమనిస్తున్న తెలుగు ప్రజల ఆత్మబంధువు, మేరునగధీరుడు అయిన ‘అన్న’ గారు “చిరంజీవీ…తెలుగుదేశం* పిలుస్తోంది రా! కదలిరా!” అంటూ గీతోపదేశం చేస్తున్నారు. సమరానికి కాలు దువ్వడానికి సంకోచిస్తూన్న ఈ అర్జునుడి ప్రశ్నకు …

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
“ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను.
ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి.”
ఆ కృష్ణుడి సమాధానం ఇది:
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
“ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో,
దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవైతావు.”
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి
“సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను
సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా.”
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి
“కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు.
కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.”
ఇది నా కల. ఎన్నాళ్లగానో వేచిన సమయం ఆసన్నమయ్యింది. అడుగు ముందుకు వేసేందుకు తటపటాయిస్తున్న వీరార్జునుడికి కర్తవ్యం బోధించడానికి అన్నగారు కలలోనైనా కనబడి ఇలా అంటారనే ఓ చిరు ఆశ.
శోధన‘ సుధాకరుడన్నట్లు మన తెలుగు ప్రజలు వెర్రివెంగళప్పలేం కాదు. వందేళ్ల కాంగ్రెసును ముఖానికి రంగు పూసుకొనే ఓ నటుడు ఏం చేస్తాడులే అన్న ఆనాటి రాజకీయ దిగ్గజాల అంచనాలను తలక్రిందులు చేస్తూ తొమ్మిది నెలల పసివాడని పార్టీని అందలమెక్కించిన ఘనత వీరి సొంతం. అలా నెత్తిన పెట్టుకొన్న అదే పార్టీని, నిర్లక్ష్యం వహించిన దానికి ఐదేళ్ల తర్వాత నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి తమ రాణువను తెలియజేసిందీ వీరే. అలాగే సమకాలీన రాజకీయాల్లో తమ ప్రతాపం ఎలాంటిదో మళ్లీ చూపించారు. అయితే నుయ్యి, కాకపోతే గొయ్యిలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఆసరా ఇచ్చే చెయ్యి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శివశంకరుని ‘వర ప్రసాదాని’కై కాచుకు కూర్చొన్నారు.
కేవలం నటుడైనంత మాత్రాన ఆయన రాజకీయాల్లో రాకూడదనడం, నీ వంటి మంచి మనిషి ఈ రాజకీయ రొంపిలో దిగబడి బురద పూసుకోవడమెందుకు అని చాలా రోజులుగా అందరూ అంటూన్న మాట. అంటే మంచి వ్యక్తులు రాజకీయాలకు తగరా? సున్నిత మనస్కులు మంచి నాయకులు కాలేరా? నా వరకు దయ, సహానుభూతి ఉన్న వ్యక్తి వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అలాగే నటుల్లో నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాయకులు పుట్టారు. ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన ‘రొనాల్డ్ రీగన్’ దగ్గరి నుంచి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెల్లా మంచి పరిపాలనాదక్షుడిగా పేరు గడించిన ‘ఆర్నాల్డ్ షార్జ్వ్నెగ్గర్’ వరకూ, తమిళనాట నీరాజనాలందుకొన్న ఎం.జి.ఆర్. దగ్గరి నుంచీ మన అన్న ఎన్.టి.ఆర్. వరకూ చరిత్రకు భాష్యం చెప్పినవారే.
ఇక ముఖ్యమంత్రి అయ్యే విషయాని కొస్తే, వచ్చే మొదటి ప్రశ్న చదువరి గారన్నట్టు “ఆంధ్ర దేశానికా? ఆంధ్ర ప్రదేశానికా?” అన్నది. తెలంగాణా మీద స్పష్టత లేకుండా ఎన్నికల బరిలో దిగే అవకాశం నాకు కనిపించడం లేదు. అందుకే గత టపాలో రెండు కుర్చీలు వేసింది అన్యాపదేశంగా ఈ విషయం దృష్టిలో ఉంచుకొనే! నా సొంత అభిప్రాయం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడంలో తప్పేమీ లేదు. ప్రపంచం నలుచెరగులా వ్యాపించిన తెలుగు వారు వివిధ దేశాల్లో నివసిస్తూ మాతృభూమితో సంబంధాలు నెరుపుకోగా లేనిది, ఒకే దేశంలో పక్కపక్కన ‘తెలంగాణా’, ‘ఆంధ్రసీమ*’లనే రెండు రాష్ట్రాలుగా కలసి ఎందుకు ఉండలేరన్నది నా ప్రశ్న.
ఇక పొత్తులంటారా నా అభిప్రాయం ప్రకారం అవినీతి రహిత, ప్రజాభ్యుదయ ప్రభుత్వాన్ని అందించడానికి ‘డా.జయప్రకాశ్ నారాయణ్’తో కలవాలని, అప్పుడే ఈ పోరాటానికి ఓ గతి, లక్ష్యం ఉంటాయి. అభినవ తిమ్మరుసు లాంటి ఆయన పరిపాలనా అనుభవం తోడైతే ఈ అభినవ కృష్ణరాయల కత్తికి ఎదురుండదు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా!
Disclaimer:
చేయి చాచిన వ్యక్తి : “అన్నయ్యా! ఈ నల్లనయ్య ఎవరు?”
మెగాస్టార్ చిరంజీవి: “నేనంటే వల్లమాలిన ఇష్టం కల ఓ అభిమాని, తమ్ముడూ!”
*దేశమంటే పార్టీ కాదోయ్…దేశమంటే మనుషులోయ్!”
*ఆంధ్రసీమ – స్వకపోలకల్పితం.
{భగవద్గీత: సాంఖ్య యోగం లోని శ్లోకాలు, మొదటి చిత్రం-తెవికీ నుంచి.
రెండవ చిత్రం: ఎయిడ్స్ డే, డిసెంబరు 1, 2003 న రవీంద్రభారతిలో }

ఆగస్ట్ 21, 2007

మా ‘హాసు’కు + మా ‘బాసు’కు పుట్టినరోజు శుభాకాంక్షలు!

Filed under: చిరంజీవి,పుట్టినరోజు,సుహాస్ — Dr.Ismail Penukonda @ 5:28 ఉద.

ఇంతలోనే ఐదేళ్లూ ఎలా గడచిపోయాయబ్బా! ఆగష్టు 21,2002 ఉదయం 6గంటలకు నా చేతుల్లో మొదటిసారి వాన్ని చూసుకొన్నప్పుడు నాలో ఏదో తెలియని ఉద్వేగం! మా శ్రీమతిని ఒక్క రోజు ఓపిక పట్టకూడదూ (మెగాస్టార్-ఆగష్టు 22!) అన్నానని, ఇప్పటికీ అందరూ నన్ను ఎగతాళి చేస్తూంటారు.కానీ మనం మనమే! తొమ్మిది నెలల (తల్లి కడుపులో ఉన్నప్పుడు)వయస్సులో మా వాడు చూసిన(విన్న) తొలి తెలుగు చిత్రం ‘ఇంద్ర’. అందుకే అప్పట్లో వాన్ని ‘ఇంద్ర’ అనే పిలిచేవారు. అందుకేనేమో మా వాడికిష్టమైన ఇంగ్లీషు రైమ్ ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్! చిరంజీవి మెగాస్టార్!’. ఇక వాళ్ల తాత నేర్పించిన ఊతపదం ‘శంకర్ దాదా – ఎం.బి.బి.ఎస్! పి.సుహాస్ ఐ.ఏ.ఎస్!’ కానీ ఇప్పుడేమో తీరం ఆవల ఉన్నాడాయె. ఈ సోదంతా ఎందుకంటే మా వాడు, నా బ్లాగు చూస్తూంటాడు…అందుకే ఈ టపా. హాసూ…మరోసారి నీకు నా హార్థిక జన్మదిన శుభాకాంక్షలురా! బాసూ…నీక్కూడా కాస్త ముందుగా!

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.