చింతు

డిసెంబర్ 21, 2007

ప్రియ వసంతమా…!

అతడు:

ప్రియ వసంతమా!

ఎందుకిలా వేధిస్తావు…

తొందరగా రావూ…!

ఏం మాయ చేశావో కానీ…

నా ప్రేమ రాగాన్ని మీటావు.

ఆమె:

ఎందుకిలా వేధిస్తావు…

ప్రియ వసంతమా…తొందరగా రావూ…!

అతడు:

ఈ మేఘచాపం….

రెపరెపలలాడుతూన్న భూదేవి కొంగు సింగారం.

ఈ ఆకులూ, ఈ పొదలూ…

ఎంత అలజడి రేపుతున్నాయో నా మదిలో.

ఊగిసలాడుతున్న నా మనస్సుకు…

ఏం చెప్పాలో తెలియకున్నది.

ఆమె:

నా మదీ వినకున్నది…

నీ దాన్ని నేనే నన్నది.

ఎందుకిలా వేధిస్తావు…తొందరగా రావూ…!

రాబోయే కలలన్నీ…కనురెప్పల మీద కూర్చొన్నాయి…

గుండె ముళ్లన్నీ విప్పుకొన్నాయి…మదిలో ప్రేమ భావనలు పురివిప్పాయి!

సప్తవర్ణాల స్వప్నాలు స్వాగతిస్తున్నాయి…

ఎందుకిలా వేధిస్తావు…తొందరగా రావూ…!

అతడు:

ఏం మాయ చేశావో కానీ…నా ప్రేమ రాగాన్ని మీటావు…

ప్రియ వసంతమా! ఎందుకలా వేధిస్తావు…త్వరగా రావూ…!

ఆమె:

అవును…ఎందుకలా వేధిస్తావు…తొందరగా రావూ…!!!

గానం: ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ & చిత్ర.

తెలుగు బ్లాగులో హిందుస్థానీ పాటేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాకెంతో ఇష్టమైన పాట ఇది. అవడానికి హిందీ లలిత సంగీతమైనా, సంగీతానికి భాష లేదు కదా! అందుకే ఇలా. అన్నట్టు నాకు తోచినంతలో పాట సాహిత్యాన్ని తెలుగులో అనువదించాను కానీ…అసలు భావం పాట వింటే మీకే తేలిగ్గా అర్థమవుతుంది (కల్హర గారో, రాధిక గారో నిజమైన కవిత రూపంలో అనువదిస్తే ఇంకా బావుంటుంది). ‘చిత్ర’ గాన మాధుర్యం, ‘ఉస్తాద్’ మంద్ర గంభీర కంఠం, కంటికింపైన పచ్చని ప్రకృతి, గాఢమైన నీలిమ, అమాయక పుష్ప సౌందర్యం, అన్నిటికీ మించి ‘నౌహీద్ సైరస్’ భీత హరిణేక్షణ చూపులూ, కంటి విరుపులు, నొసటి నాట్యాలూ, ఓహ్…ఇవన్నీ ఈ పాటకు వన్నెలద్దాయి. చూసి, విని, అనుభవించి…పలవరించండి! – బ్లాగర్లకందరికీ బక్రీదు శుభాకాంక్షలు.

డిసెంబర్ 16, 2007

హీరోలు, వైద్యులు, ఇద్దరు అమ్మాయిలు

హీరోలనగానే మనకు గుర్తొచ్చేది సినిమా హీరోలే! కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఆ హీరోల గురించి కాదు నిజజీవితపు హీరోల గురించి. చాలా రోజుల కిందటే “సి.ఎన్.ఎన్. హీరోస్” అని ఆ ఛానల్ ఓ పోటీ పెట్టింది. మనకు తెలిసిన హీరోల గురించి వారికి సమాచారమిస్తే వారు, న్యాయనిర్ణేతలు ఓ ఆరు హీరోలను ఎంపిక చేస్తారు. అందులో చివరి వరకు వచ్చిన వారిలో మన అయ్యకుడికి చెందిన ఎస్.రామకృష్ణన్ కూడా ఉన్నారు. నా వంతుగా తమకు చేతనైన కృషి చేస్తూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతూన్న ‘టుమేక్ ఎ ఢిఫరెన్స్’ ప్రశాంతి గారి గురించి ఈ పోటికి సిఫార్సు చేసాను. చిన్న చిన్న అడుగులే ఓ మహా ప్రస్థానానికి కారణభూతమవుతాయి.

ఈ హీరోల్లో నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకొన్న వ్యక్తి కెన్యాకు చెందిన ‘పీటర్ కిటానే’. పన్నెండేళ్ల ప్రాయంలో ఏదో తెలియని జబ్బుతో ఇద్దరు తల్లిదండ్రులు, ఆరుగురు తోబుట్టువులు అసువులుబాస్తే అనాథగా మిగిలిన ఈ కుర్రాడు, తోటి బంధువులు-స్నేహితులు వద్దన్నా వినకుండా చదువును వదిలిపెట్టకుండా, కష్టపడి ఓ మంచి ఉన్నత పాఠశాలలో స్థానం సంపాదించి, చివరకు అమెరికాలోని సియాటిల్లోని కళాశాలలో చేరాడు. అంతటితో తన జీవితానికి ఓ ఆధారం దొరికిందని ఊరుకోకుండా, తన వాళ్లకు ఏదైనా చేయాలనే తపనతో సొంతూరులో “మామా మారియా క్లినిక్” స్థాపించి వైద్య సదుపాయాల్లేని ఆ ఊరి ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. ఎయిడ్స్ రోగ బాధితుల కోసం మరో పెద్ద క్లినిక్ నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతను నా హీరో. నా స్ఫూర్తి ప్రదాత.

* * *

గత కొన్ని రోజులుగా ఆంధ్రదేశంలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న సమ్మెలు, మధ్యలో నలిగిపొతున్న అమాయక ప్రాణాల గురించి ఆలోచిస్తే…దాడులు కొత్త కావు, ఆ మాటకొస్తే సమ్మెలూ కొత్తేం కాదు. దీనికి కారణం కేవలం వైద్యులు, దాడి చేస్తున్న రౌడీమూక కాదు అసలు దోషి ‘వైద్య వ్యవస్థ’. ప్రతిదాన్ని ప్రవేటుపరం చేయాలని ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. కానీ మన ప్రజల్లో ఎంత మంది ఖరీదైన వైద్యాన్ని చేయించుకొనే స్థోమత కలిగి ఉన్నారో అందరికీ తెలుసు. ఏ రంగాన్ని ప్రైవేటీకరించినా విద్య, వైద్యం అందరికీ అందించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఏ కారణాల వల్లనైతేనేమి ఆ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తూంది. సరైన మౌలిక వసతుల్లేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం వికటిస్తే ఆ నెపమంతా అక్కడి వైద్యుల పైనే పడుతుంది.

మొన్న జరిగిన వైద్య విద్యార్థిని పై దాడి కేసులో రోగి చనిపోవడానికి మూలకారణం ‘పల్మనరీ ఎంబాలిజం’ అనే సమస్య. ముందే ఆ అభాగ్యురాలి కడుపులో పిండం చనిపోయి కొద్దిరోజులవుతోంది. అలాంటప్పుడు మన శరీరంలో రక్తం గడ్డ కట్టే పరిస్థితి ఎదురవుతుంది. మనకు ఏదైనా గాయం తగిలితే కొద్ది సేపట్లోనే రక్తం గడ్డకడుతుంది. రక్తంలోని ‘ప్లేట్లెట్లు’ అనబడే కొన్ని కణాలు, ఇతరత్రా కారకాల వల్ల జరిగే ఈ ప్రక్రియ మన ప్రాణాలు కాపాడుతుంది. ఇదే శరీరంలో జరిగితే చాలా ప్రమాదకరం. పైన చెప్పిన ఈ కేసులో అలా జరగడానికి పిండం చనిపోవడం వల్ల, తల్లి రక్తంలో జరిగే మార్పుల వల్ల ఆస్కారం ఎక్కువ. అలా తయారైన రక్తపు గడ్డలు, రక్తనాళాల్లో ప్రయాణించి ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలలో చిక్కకొని, మనకు ప్రాణాధారమైన ‘ఆమ్లజని’ (ఆక్సిజన్)ను అందకుండా చేస్తుంది, మరణానికి కారణమవుతుంది. ఇదంతా క్షణాల్లో జరగొచ్చు, అంటే రక్తపు గడ్డలు ఎక్కడో ఉండి, రక్తప్రవాహ వేగానికి ఉన్నట్టుండి ప్రవాహంలో చేరి ఈ ‘పల్మనరీ ఎంబాలిజం’ను కలిగించొచ్చు.

ఇవన్నీ చెబితే అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఆ రోగి బంధువులు ఉండాలిగా! ఏదేమైనా ఇలా ప్రతి చావుకు దాడి జరుపుకుంటూ పోతే ఇక వైద్యం చేయడానికి ఎవరూ మిగలరు. కొద్ది నెలల క్రితం కర్నూలులో ఇలాగే, తన తప్పులేకపోయినా, ఓ పి.జి.వైద్య విద్యార్థిపై యాసిడ్ తో దాడి చేసారు. ఇప్పుడతను కళ్లు కోల్పోయి ఇన్నేళ్లు చదివిన వైద్య వృత్తికి దూరంగా ఉన్నాడు. ఇలా ఎన్నో! ప్రభుత్వం ఇలాంటి వారి మీద కఠిన చర్యలు చేపట్టి, వైద్యుల్లో, వైద్య విద్యార్థుల్లో ధైర్యం నింపకపోతే అందరూ ఇతర చదువులకు మళ్లే ప్రమాదముంది.

* * *

సమాచార విప్లవం తెచ్చిన ఒరవడి వల్ల ఈ ఇద్దరు అమ్మాయిల గురించి చదివే అవకాశం కలిగింది. ఒకరు కుడివైపు గుండె కలిగి, గుండెలో రంధ్రం ఉండి శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తూన్న అభాగ్యురాలు, మరొకరు చేయూత అందిస్తే మరో పి.టి.ఉషలా దేశానికి పేరు తెచ్చే తెగువ ఉన్న తరుణీమణీ. చేతనైన సాయం నేను చేశాను, మీరు చేయండి ఇక్కడ.

ఒలింపిక్స్̍లో మనకు స్వర్ణ పతకాలు ఎందుకు రావంటే…?

డిసెంబర్ 12, 2007

తెలుగు ప్రజా హృదయాధినేత!

తెలుగు ప్రజలకు చరిత్ర సృష్టించే మరో అవకాశం వచ్చింది. మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకం తమ హృదయాంతరంగాన్ని అవలోకనాల్లో బహిర్గతం చేస్తోంది. పైనుంచి అంతా చిద్విలాసంగా గమనిస్తున్న తెలుగు ప్రజల ఆత్మబంధువు, మేరునగధీరుడు అయిన ‘అన్న’ గారు “చిరంజీవీ…తెలుగుదేశం* పిలుస్తోంది రా! కదలిరా!” అంటూ గీతోపదేశం చేస్తున్నారు. సమరానికి కాలు దువ్వడానికి సంకోచిస్తూన్న ఈ అర్జునుడి ప్రశ్నకు …

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
“ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను.
ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి.”
ఆ కృష్ణుడి సమాధానం ఇది:
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
“ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో,
దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవైతావు.”
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి
“సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను
సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా.”
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి
“కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు.
కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.”
ఇది నా కల. ఎన్నాళ్లగానో వేచిన సమయం ఆసన్నమయ్యింది. అడుగు ముందుకు వేసేందుకు తటపటాయిస్తున్న వీరార్జునుడికి కర్తవ్యం బోధించడానికి అన్నగారు కలలోనైనా కనబడి ఇలా అంటారనే ఓ చిరు ఆశ.
శోధన‘ సుధాకరుడన్నట్లు మన తెలుగు ప్రజలు వెర్రివెంగళప్పలేం కాదు. వందేళ్ల కాంగ్రెసును ముఖానికి రంగు పూసుకొనే ఓ నటుడు ఏం చేస్తాడులే అన్న ఆనాటి రాజకీయ దిగ్గజాల అంచనాలను తలక్రిందులు చేస్తూ తొమ్మిది నెలల పసివాడని పార్టీని అందలమెక్కించిన ఘనత వీరి సొంతం. అలా నెత్తిన పెట్టుకొన్న అదే పార్టీని, నిర్లక్ష్యం వహించిన దానికి ఐదేళ్ల తర్వాత నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి తమ రాణువను తెలియజేసిందీ వీరే. అలాగే సమకాలీన రాజకీయాల్లో తమ ప్రతాపం ఎలాంటిదో మళ్లీ చూపించారు. అయితే నుయ్యి, కాకపోతే గొయ్యిలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఆసరా ఇచ్చే చెయ్యి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శివశంకరుని ‘వర ప్రసాదాని’కై కాచుకు కూర్చొన్నారు.
కేవలం నటుడైనంత మాత్రాన ఆయన రాజకీయాల్లో రాకూడదనడం, నీ వంటి మంచి మనిషి ఈ రాజకీయ రొంపిలో దిగబడి బురద పూసుకోవడమెందుకు అని చాలా రోజులుగా అందరూ అంటూన్న మాట. అంటే మంచి వ్యక్తులు రాజకీయాలకు తగరా? సున్నిత మనస్కులు మంచి నాయకులు కాలేరా? నా వరకు దయ, సహానుభూతి ఉన్న వ్యక్తి వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అలాగే నటుల్లో నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాయకులు పుట్టారు. ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన ‘రొనాల్డ్ రీగన్’ దగ్గరి నుంచి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెల్లా మంచి పరిపాలనాదక్షుడిగా పేరు గడించిన ‘ఆర్నాల్డ్ షార్జ్వ్నెగ్గర్’ వరకూ, తమిళనాట నీరాజనాలందుకొన్న ఎం.జి.ఆర్. దగ్గరి నుంచీ మన అన్న ఎన్.టి.ఆర్. వరకూ చరిత్రకు భాష్యం చెప్పినవారే.
ఇక ముఖ్యమంత్రి అయ్యే విషయాని కొస్తే, వచ్చే మొదటి ప్రశ్న చదువరి గారన్నట్టు “ఆంధ్ర దేశానికా? ఆంధ్ర ప్రదేశానికా?” అన్నది. తెలంగాణా మీద స్పష్టత లేకుండా ఎన్నికల బరిలో దిగే అవకాశం నాకు కనిపించడం లేదు. అందుకే గత టపాలో రెండు కుర్చీలు వేసింది అన్యాపదేశంగా ఈ విషయం దృష్టిలో ఉంచుకొనే! నా సొంత అభిప్రాయం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడంలో తప్పేమీ లేదు. ప్రపంచం నలుచెరగులా వ్యాపించిన తెలుగు వారు వివిధ దేశాల్లో నివసిస్తూ మాతృభూమితో సంబంధాలు నెరుపుకోగా లేనిది, ఒకే దేశంలో పక్కపక్కన ‘తెలంగాణా’, ‘ఆంధ్రసీమ*’లనే రెండు రాష్ట్రాలుగా కలసి ఎందుకు ఉండలేరన్నది నా ప్రశ్న.
ఇక పొత్తులంటారా నా అభిప్రాయం ప్రకారం అవినీతి రహిత, ప్రజాభ్యుదయ ప్రభుత్వాన్ని అందించడానికి ‘డా.జయప్రకాశ్ నారాయణ్’తో కలవాలని, అప్పుడే ఈ పోరాటానికి ఓ గతి, లక్ష్యం ఉంటాయి. అభినవ తిమ్మరుసు లాంటి ఆయన పరిపాలనా అనుభవం తోడైతే ఈ అభినవ కృష్ణరాయల కత్తికి ఎదురుండదు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా!
Disclaimer:
చేయి చాచిన వ్యక్తి : “అన్నయ్యా! ఈ నల్లనయ్య ఎవరు?”
మెగాస్టార్ చిరంజీవి: “నేనంటే వల్లమాలిన ఇష్టం కల ఓ అభిమాని, తమ్ముడూ!”
*దేశమంటే పార్టీ కాదోయ్…దేశమంటే మనుషులోయ్!”
*ఆంధ్రసీమ – స్వకపోలకల్పితం.
{భగవద్గీత: సాంఖ్య యోగం లోని శ్లోకాలు, మొదటి చిత్రం-తెవికీ నుంచి.
రెండవ చిత్రం: ఎయిడ్స్ డే, డిసెంబరు 1, 2003 న రవీంద్రభారతిలో }

నవంబర్ 29, 2007

నెఱవెన్నెలలు కురిపించే పాట!

Filed under: ఇష్టమైన పాట,ఎన్టీయార్,వెన్నెల — Dr.Ismail Penukonda @ 5:58 ఉద.

నవంబర్ 25, 2007

ఔరా! ‘రైతు’ రాజకీయం.

Filed under: బాబు,రాజకీయం,రైతు — Dr.Ismail Penukonda @ 4:21 ఉద.

రెండు నెలల విరామమంటూ ప్రకటించుకొన్నాక, ఇప్పటివరకు నా బ్లాగు దరిదాపులకి రాలేదు. ఎన్నో సంగతులు చెప్పాల్సినవి ఉన్నా చాలా నిగ్రహం పాటిస్తూ వచ్చాను. కానీ ఈ రోజు ‘రైతు గర్జన’ అంటూ ఆంధ్ర ప్రజలను మభ్యపెడుతున్న మన బాబు గారి ఆగ్రహాన్ని చూసి ఈ ఒక్కసారికీ నిగ్రహాన్ని చూపలేకపోయాను. మితృలతో రాజకీయాలు, మతం మాట్లాడకూడదని ఓ నానుడి. అది బ్లాగుపరంగాను నిజమని తెలిసింది. ఇకపై అలా మాట్లాడకూడదని నిర్ణయం తీసుకొన్నాక కూడా, ఈ రాజకీయ టపా ఎందుకంటే కడుపు మంట ఆపుకోలేక!

నా మూడేళ్ల ప్రభుత్వోద్యోగంలో ’03 దాకా అనంతపురం జిల్లా అంతటా ఏ మూలకెళ్లినా రైతుల ఆత్మహత్యలే. కాపాడగలిగిన వారిని కాపాడినా ఎందుకు బతికించారు సారూ? అన్న వారి ప్రశ్నలే నాకు జవాబులు. ఇక రాలిపోయిన వారెంత మందో? ఆనాడు ఇదే రైతుల చావుల గురించి ప్రశ్నిస్తే, ఘనత వహించిన ఈ మా.ము.మం. బాబు గారు ఎక్స్-గ్రేషియాగా ఇచ్చే లక్షకో, పాతికకో ఆశపడి ఆత్మహత్య చేసుకొంటున్నారని ఈసడించారు. తను మొదలుపెట్టానని గర్వంగా చెప్పుకొంటున్న సరళీకరణ మంత్రాలకు, ఆనాడు మానవతా పార్శ్వం కనిపించలేదు కాబోలు.

ఈనాడు నిర్లజ్జగా చెర్నాకోలు పట్టి, ఎద్దుల బండినెక్కి, దుక్కి దున్నేవానిలా నాగలి భుజాన పెట్టి తన కంటే పెద్ద రైతు బాంధవుడు లేనేలేడని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. రికార్డు బద్దలుకొట్టిన తన తొమ్మిదేళ్ల పరిపాలనలో వినిపించలేదా ఈ రైతు గోడు. ఆనాటి వారి ఆక్రందనలే శాపాలుగా మారి తన పదవికి ఎసరొచ్చే దాకా ప్రజల ఘోష ఆయన మెత్తటి మనసుకు వినిపించలేదా? చుట్టుపక్కల ఉన్నవాళ్లు, అయ్యేయస్సులు, తోటి నాయకులు చెప్పినా తలకెక్కని విషయం ఇప్పుడు కావలసి వచ్చింది, రాజకీయ లబ్ధికి కాకపోతే, ఆయన గుండెల మీద చేయి వేసుకొని ఈ ఒక్కసారికైనా నిజం చెప్పమనండి. కనీసం చేసిన తప్పును ఒప్పుకొని తెలుగు రైతాంగాన్ని క్షమాపణ అడిగితే కాస్తయినా పాప పరిహారం దక్కుతుంది.

ఇదంతా చదివి నేను కాంగిరేసు పంకానని అపోహ పడేరు, తె.దే.పా ఆవిర్భవించిన రోజుల్లో ఇంటి ముందు టెంటు, చొక్కాకు ఎన్టీవోడి బొమ్మా, చేతిలో పసుపు జెండా పట్టుకొని మూడు-నాలుగు తరగతులలో నుంచే రాజకీయ చైతన్యం పొందినవాడిని. ‘చేయెత్తి జై కొట్టు తెలుగోడా…గతమెంతో ఘనకీర్తి కలవోడా’ అంటూ చెవులు గింగురుమనేలా రికార్డులు వేసినవాడిని. (ఆ ప్రభావమే నా బ్లాగు మకుటంలో కూడా కనిపిస్తుంది) అసలు మా నియోజక వర్గం శాసనసభ్యుడు మన ‘అన్నగారు’. ఆయన ఏ విషయాలలో ఏమి చేసినా, ఆకలిగొన్న వాడికి కూడు – రెండు రూ. కిలో బియ్యం, గుడ్డ – జనతా వస్త్రాలు , నీడ ఇచ్చి ఆదుకొన్న మనిషి. పేదవారి పట్ల, రైతుల పట్ల అభిమానము, నిజాయితీ, వారి బాగోగుల కోసం ఏమైనా చేయాలని తాపత్రయం పడ్డ మనిషి.

అలాంటి ఆయన్ని కారణాలేమైనా, నట్టేట ముంచి, వెన్నుపోటుతో రాజ్యాధికారం చేబట్టి, ఈనాడు నిస్సిగ్గుగా ఆయన పేరు జపిస్తూ, ఆయన బొమ్మలను వాడుకొంటూ, తెలుగింటి ఆడపడుచులకు… (గుర్రాలతో తొక్కించి, నీళ్లను కుమ్మరించినప్పుడేమైందో ఈ ఆడపడుచుల పై ప్రేమ!) అంటూ నక్క వినయాలు నటిస్తే, ఓట్లు కుమ్మరిస్తారని అనుకొంటున్నాడు కాబోలు. వచ్చిన జనాన్ని చూసి వాపుని బలుపుగా భ్రమపడితే మరోసారి భంగపాటు తప్పదు. అవినీతి రాజ్యమేలుతున్న ప్రభుత్వ వ్యతిరేకతే ఇదంతా, మన మహాజనానికి ఒక కొఱివి పోతే, ఇంకో కొఱివి తప్ప నిజంగా కాపాడే నాథుడేడీ?

{చిత్ర సౌజన్యం: 1.ది హిందూ – కార్టూనిస్ట్: కేశవ్, 2.ఈనాడు}

అక్టోబర్ 14, 2007

ఈద్-ముబారక్, దండయాత్ర , వీడ్కోలు!

Filed under: ఈద్ ముబారక్,దండయాత్ర,వీడ్కోలు — Dr.Ismail Penukonda @ 4:03 ఉద.
తెలుగు బ్లాగర్లందరికీ ‘రంజాన్’ పండుగ సందర్భంగా ఈద్-ముబారక్! రంజాన్ పండుగ అనగానే ఆ ముందు రోజు ఎంతో ఉత్సాహంగా పెట్టుకొనే గోరింటాకు, పొద్దున లేవగానే తలంటు పోసుకొని వేసుకొనే కొత్త బట్టలు, బంధువులందరితో కలిసి మా హిందూపురం ఈద్గాకు వెళ్లి చేసే పండుగ నమాజు, దాని తరువాత ఏది కావాలంటే అది కొనిచ్చే అవ్వ-తాతలు, పక్కింటి వారికి అందించే క్యారియర్లు, బావలు-బామ్మర్దులు అందరితో కలిసి హుషారుగా వెళ్లే సినిమాలు, అలసిసొలసి ఇంటికొచ్చి మిద్దె పైకెక్కి వినే కథలూ…ఇవన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదలుతాయి.

మరి ఆ అనుభూతులకు సరితూగే విధంగా చేసుకోలేకపోయినా ఉన్నంతలో మొన్న అనంతపురం బాబా టైలర్స్ నుంచి కుట్టి పంపించిన కొత్త బట్టలు, ఇంట్లో చేసిన పాయసం, మా సుహాస్ తో కలిసి వెళ్లి చేసిన పండుగ నమాజు, న్యూయార్క్ నగరం నుంచి వచ్చిన మా అతిథులతో భోజనాలు+”హ్యాపీ డేస్” సినిమా ఇలా బాగానే గడిచింది. కాకపోతే బంధుమిత్రుల ఆలింగనాలను మాత్రం బాగా మిస్సయ్యాను, అంతే కాక పైలోకాన ఉన్న మా తాతలిద్దరినీ ఇంకా చాలా మిస్సయ్యాను. మొత్తానికి పండుగంతా ముగించేసి స్వదేశంలో ఈ రోజు పండుగ జరుపుకుంటున్న బంధుమిత్రులందరికీ కాల్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ అంత ముఖ్యమూ అయిన బ్లాగ్మిత్రులతోనూ ఈ విధంగా నా ఆనందాన్ని పంచుకొంటున్నాను.

ఇక బ్లాగులకు ఓ రెండు నెలల పాటు వీడ్కోలు చెప్పుదామని నిశ్చయించాను. మరో సంవత్సరం, మరో యుద్ధం, సన్నద్ధమవ్వాలిగా అందుకు. పోయినేడాది విజయం చేజారిపోయినా మరోసారి చేసే ప్రయత్నంలో ఈ కాస్త విరామం తప్పడంలేదు. కాబట్టి ఇలా సాహితీగోష్టులకు, చర్చావేదికలకు కొంత కాలం పాటు దూరం ఉంటూ ఆ రాయలు

సీ.తొల దొల్త నుదయాద్రి శిలఁదాకి తీండ్రించు
యసి లోహమున వెచ్చనై జనించె;
మఱి కొండవీడెక్కి మార్కొని నలియైన
యల కసవాపాత్రునంటి రాఁజె
నట సాఁగి జమ్మిలోయఁబడి వేగిదహించెఁ
గోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ
గనకగిరి స్ఫూర్తిఁ గరచె; గౌతమిఁగ్రాచె;
నవుల నాపొట్నూర రవులు కొనియె;

తే.మాడెములు వ్రేల్చె; నొడ్డాది మసి యొనర్చెఁ

గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱనఁ
దోఁక చిచ్చన; నౌర నీ దురవగాహ
ఖేలదుగ్ర ప్రతాపాగ్ని కృష్ణరాయ!”
{ఆముక్తమాల్యద 1:36}
చేసిన దండయాత్ర లాగా నా ఈ దండయాత్ర న్యూజెర్సీ, న్యూయార్క్ల మీదుగా ఓహయో, పశ్చిమ వర్జీనియాలపై వెళుతూ, లూయీసియానా దగ్గర ఆగుతుంది. గెలుపెక్కడో మరి? ఈ ప్రయాణాల్లో మన బ్లాగర్లనీ కలవవచ్చేమో పోయినసారి కలిసినట్టుగా. అలాగే విజయదశమి శుభాకాంక్షలు ముందుగానే అందుకోండి. అంత వరకు టాటా…వీడుకోలు…ఇంక సెలవు!

అక్టోబర్ 13, 2007

హ్యాపీ డేస్!

సినిమా చూస్తూన్నంత సేపూ మన బ్లాగర్లే కళ్ల ముందు కదలాడారు. వ్యక్తిగతంగా లేదా వారి బ్లాగుచిత్రాలలో చూసి ఉండడం వల్ల ముఖకవళికలతో పోలిక కొంత మంది, వారి అభిరుచుల ఆధారంగా, వారిని ప్రత్యక్షంగా చూడకపోయినా, మరి కొంత మంది జ్ఞప్తికి వచ్చారు. రాజేష్ ను చూడగానే ‘ప్రవీణ్ గార్లపాటి’, టైసన్ గా మన ‘రాక్-ఏశ్వరుడు’, శంకర్ గా ‘రానారె’ (మరి రానారె నవ్వు అచ్చంగా ఇతనిలాగే ఉంటుంది మరి), ఇక చివరికి చందు ఎవరా అనుకొంటూంటే హఠాత్తుగా గుర్తొచ్చింది: మన ఎవర్ గ్రీన్ ‘విహారి’ . విద్యార్థులకు బుద్ధులు చెప్పే ఫ్రెంచి గడ్డం మాస్టారిగా మన ‘సాలభంజికల’ వారు, కీలెరిగి వాత పెట్టే స్ట్రిక్టు మాస్టారిగా ‘కొత్తపాళీ’ గారు. ఇలా సినిమా అంతా బ్లాగుమయం చేసి చూసేశాను. అవును అసలు సూత్రధారి ‘శేఖర్’ గారిని మరచిపోయేనని అనుకొనేరు, ఆ బ్లాగ్శేకరుడు ‘ వెంకట్’.
ఇక సినిమా గురించి చాలా ఎక్కువగా వినడం వల్ల బాగుంది అనిపించింది. అయినా ప్రేమదేశం అంతగా ఊపేస్తోందంటే నమ్మశక్యంగా లేదు. అక్కడక్కడా మనస్సును తాకే సన్నివేశాలు ఉన్నా మనల్ని ఊపేసే సినిమా అయితే మాత్రం కాదు. అసలు కమ్ముల గారి సినిమాలు నిండు గోదారిలా ఉంటాయి కానీ ఉరకలెత్తే కృష్ణమ్మలా ఉండవు. మొత్తానికి మంచి సినిమా. ఇక నటీనటుల పరంగా రాజేష్ పాత్రధారి నిఖిల్ కే పూర్తి మార్కులు. ఇక సినిమా ఆరంభంలోనే మితృలతో చెప్పాను చిరు పేరు ఒక్కసారైనా వస్తుందని విజిలేయక తప్పదని. అనుకొన్నట్టే వచ్చింది, విజిలూ పడింది.ఇక నా వరకూ వస్తే నేనూ ప్రతి పాత్రతోనూ నన్ను సరిపోల్చుకొన్నాను. పదో తరగతి దాకా ‘టైసన్’, ఇంటర్లో ‘శంకర్’, తర్వాత నాలుగేళ్లు ‘రాజేష్’, కాలేజి చివరి సంవత్సరం ‘చందు’…ఇలా అన్నమాట అది ఎందుకో నాకే తెలుసు మరి:)

అక్టోబర్ 9, 2007

తెలుగు వాడికి ‘నోబెల్’ ఎప్పుడు?

Filed under: 2007,నోబెల్,వైద్యశాస్త్రం — Dr.Ismail Penukonda @ 3:55 ఉద.

ఈ రోజు ఈ-వేగు చూడగానే నాలో ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారే ముప్పిరిగొన్నాయి. కారణం మూడు రోజులుగా డి.సి. ప్రాంతంలో తిరిగి తిరిగి (అంత.ప్రసాద్ గారికి క్షమాపణలతో) చివరిగా వాషింగ్టన్ దగ్గరి శివ-వైష్ణవ ఆలయం ఎదురుగా ఉన్న నాసా గోడార్డ్ కేంద్రం ముఖద్వారం పై ఆ కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తకు నోబెల్ వచ్చిందని చదివి ఐదు నిముషాలు కాలేదు, నా దృశ్య-శ్రవణ యంత్రం క్షణం పాటు కిర్రుమంది. సరే అని ఒక నొక్కు నొక్కితే యుటా వైద్య విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తూన్న డా.బెల్లంకొండ కృష్ణకిశోర్ గారి దగ్గరి నుండి వచ్చిన వేగది.

వేగు సారాంశం, ఈ సంవత్సరానికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన ముగ్గురి గురించి: యుటా వై.వి.కి చెందిన డా.మారియో కాపెచ్చి, ఉత్తర కెరొలినాకు చెందిన డా. ఒలివర్ స్మిథీస్, యు.కె.లో కార్డిఫ్ కు చెందిన డా. మార్టిన్ ఎవాన్స్ వీరే ఆ ముగ్గురు మరాఠీలు. వీరు ముగ్గురూ జన్యు శాస్త్రంలో గత ఇరవై-ముఫై ఏళ్లుగా చేసిన పరిశోధన ఫలితమిది.
టూకీగా చెప్పాలంటే మూషికాలలో వివిధ జన్యువుల్ని మట్టి కరిపించి (నాక్-అవుట్ మైస్) మానవుల్లోని జబ్బుల గురించి, వాటి జన్యు నేపథ్యాన్ని కనిపెట్టడంలోనూ, తద్వారా అనేక రకాల రుగ్మతలకు చికిత్స కనుక్కోవడంలోనూ వీరి కృషి ఎంతో ఉంది. నోబెల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా ఈ వేగు అందడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక ఆనందం అంటారా…మా కర్నూలు వైద్య కళాశాల విద్యార్థి అయిన కిశోర్ మాస్టారు, యుటాలో తన సహోద్యోగి గానే కాక, ఎన్.ఐ.హెచ్. వారి పరిశోధనల్లో సహ-పరిశోధకుడిగా తనకు తెలిసిన, తనతో పాటు పని చేస్తున్న డా.మారియో కాపెచ్చి గారికి నోబెల్ రావడమే!
వైద్య పరిశోధనల్లో మన మూషిక రాజాలను విరివిగా ఉపయోగిస్తూంటారు. శ్రీశ్రీ ఏదో పాటలో ‘ఓ పుత్తడిబొమ్మా… నీ పట్టుచీరకు తరించేను, పట్టుపురుగు జన్మ’ అన్నట్టు సర్వ మానవాళి ఆరోగ్యానికి ఇలా ఎన్నో మూషికాలు ముక్తిమార్గం చేరుతుంటాయి. కానీ వీటితో పనిచేయడం అంటే కొంత మందికి చిన్నచూపు, కానీ ఆ పరిశోధనల వల్ల తెలియకుండానే మనలో చాలా మంది ప్రతిఫలం పొందుతున్నాం. ఎందరు వద్దని వారించినా అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా పరిశోధనా మార్గం ఎంచుకొన్న మా కిశోర్ మాస్టారు ఈనాడు ఒక నోబెల్ శాస్త్రవేత్త సహచరుడంటే గర్వకారణమే కదా. ఓ తెలుగు వాడికి నోబెల్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు!
(డా.కాపెచ్చి అమెరికా జాతీయ పురస్కారం అందుకొంటున్నప్పటి చిత్రం)
తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.