చింతు

అక్టోబర్ 9, 2007

తెలుగు వాడికి ‘నోబెల్’ ఎప్పుడు?

Filed under: 2007,నోబెల్,వైద్యశాస్త్రం — Dr.Ismail Penukonda @ 3:55 ఉద.

ఈ రోజు ఈ-వేగు చూడగానే నాలో ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారే ముప్పిరిగొన్నాయి. కారణం మూడు రోజులుగా డి.సి. ప్రాంతంలో తిరిగి తిరిగి (అంత.ప్రసాద్ గారికి క్షమాపణలతో) చివరిగా వాషింగ్టన్ దగ్గరి శివ-వైష్ణవ ఆలయం ఎదురుగా ఉన్న నాసా గోడార్డ్ కేంద్రం ముఖద్వారం పై ఆ కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తకు నోబెల్ వచ్చిందని చదివి ఐదు నిముషాలు కాలేదు, నా దృశ్య-శ్రవణ యంత్రం క్షణం పాటు కిర్రుమంది. సరే అని ఒక నొక్కు నొక్కితే యుటా వైద్య విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తూన్న డా.బెల్లంకొండ కృష్ణకిశోర్ గారి దగ్గరి నుండి వచ్చిన వేగది.

వేగు సారాంశం, ఈ సంవత్సరానికి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన ముగ్గురి గురించి: యుటా వై.వి.కి చెందిన డా.మారియో కాపెచ్చి, ఉత్తర కెరొలినాకు చెందిన డా. ఒలివర్ స్మిథీస్, యు.కె.లో కార్డిఫ్ కు చెందిన డా. మార్టిన్ ఎవాన్స్ వీరే ఆ ముగ్గురు మరాఠీలు. వీరు ముగ్గురూ జన్యు శాస్త్రంలో గత ఇరవై-ముఫై ఏళ్లుగా చేసిన పరిశోధన ఫలితమిది.
టూకీగా చెప్పాలంటే మూషికాలలో వివిధ జన్యువుల్ని మట్టి కరిపించి (నాక్-అవుట్ మైస్) మానవుల్లోని జబ్బుల గురించి, వాటి జన్యు నేపథ్యాన్ని కనిపెట్టడంలోనూ, తద్వారా అనేక రకాల రుగ్మతలకు చికిత్స కనుక్కోవడంలోనూ వీరి కృషి ఎంతో ఉంది. నోబెల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా ఈ వేగు అందడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక ఆనందం అంటారా…మా కర్నూలు వైద్య కళాశాల విద్యార్థి అయిన కిశోర్ మాస్టారు, యుటాలో తన సహోద్యోగి గానే కాక, ఎన్.ఐ.హెచ్. వారి పరిశోధనల్లో సహ-పరిశోధకుడిగా తనకు తెలిసిన, తనతో పాటు పని చేస్తున్న డా.మారియో కాపెచ్చి గారికి నోబెల్ రావడమే!
వైద్య పరిశోధనల్లో మన మూషిక రాజాలను విరివిగా ఉపయోగిస్తూంటారు. శ్రీశ్రీ ఏదో పాటలో ‘ఓ పుత్తడిబొమ్మా… నీ పట్టుచీరకు తరించేను, పట్టుపురుగు జన్మ’ అన్నట్టు సర్వ మానవాళి ఆరోగ్యానికి ఇలా ఎన్నో మూషికాలు ముక్తిమార్గం చేరుతుంటాయి. కానీ వీటితో పనిచేయడం అంటే కొంత మందికి చిన్నచూపు, కానీ ఆ పరిశోధనల వల్ల తెలియకుండానే మనలో చాలా మంది ప్రతిఫలం పొందుతున్నాం. ఎందరు వద్దని వారించినా అందరూ వెళ్లే దారిలో వెళ్లకుండా పరిశోధనా మార్గం ఎంచుకొన్న మా కిశోర్ మాస్టారు ఈనాడు ఒక నోబెల్ శాస్త్రవేత్త సహచరుడంటే గర్వకారణమే కదా. ఓ తెలుగు వాడికి నోబెల్ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు!
(డా.కాపెచ్చి అమెరికా జాతీయ పురస్కారం అందుకొంటున్నప్పటి చిత్రం)

4 వ్యాఖ్యలు »

  1. చాలా సంతోషకరమైన టపా. మీకే కాదు, ప్రతి తెలుగు వాడికి గర్వకారణమై. గురుశిష్యులకు నోబెల్ వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి, డా.బెల్లంకొండ కృష్ణకిశోర్ గారికి కూడా త్వరలో నోబెల్ రావాలి అశిస్తూ..

    మరమరాలు

    వ్యాఖ్య ద్వారా మరమరాలు — అక్టోబర్ 9, 2007 @ 9:26 ఉద.

  2. నేను మరమరాలు తో కలుస్తున్నాను
    smile గారు

    వ్యాఖ్య ద్వారా Budaraju Aswin — అక్టోబర్ 9, 2007 @ 1:51 సా.

  3. మన తెలుగు వాడికి తప్పకుండా వస్తుంది……కానీ ఆ పాట రాసింది శ్రీ శ్రీ కాదు వేటూరి……

    వ్యాఖ్య ద్వారా నరహరి — అక్టోబర్ 10, 2007 @ 1:07 సా.

  4. CCMB, IICT లలో పనిచేసే భార్యాభర్తలైన ఇద్దరు హైదరాబాదీ శాస్త్రవేత్తలకు వైద్యవిభాగంలోనే నిరుడు రావలసిన నోబెల్ బహుమతి తప్పిపోయింది. ఐతే వాళ్లు తెలుగువాళ్ళో కాదో తెలియదు. ఈ వార్త చూడండి:

    http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2006100420110100.htm&date=2006/10/04/&prd=th&

    శాంతి, సాహిత్యాలను మినహాయిస్తే ఇతర రంగాల్లో నోబెల్ బహుమతిని అమెరికా-ఐరోపా వాసులకే ఇంకా బంతిలో వలపక్షం చేస్తూనే ఉన్నారు.

    వ్యాఖ్య ద్వారా సుగాత్రి — అక్టోబర్ 10, 2007 @ 3:46 సా.


RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.